Latest Updates...!

Saturday, 16 November 2013

7th April - World Health Day

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం , world health day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (April 07 th-ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము...................


ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆవిర్భావ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడున ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గా జరుపుకుంటారు.

-- ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు.ఎంత సంపాదించినా ఆరోగ్యం సహకరించకుంటే అదంతా వేస్టే. ఆరోగ్యానికున్న ప్రాధాన్యత అలాంటిది. ఇవాళ ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం...1948 ఏప్రిల్ ఏడో తేదిన మొదటిసారి ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని WHO నిర్వహించారు. అయితే 1950 నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ రోజున వరల్డ్ హెల్త్ సమావేశాన్ని జరుపుతున్నారు. ప్రజలు వివిధ రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు, రక్షిత మంచినీటి సప్లయ్, అత్యవసర సమయాల్లో ఆరోగ్యకరమైన అంశాలపై సమన్వయం, వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (Address:World Health rganization . Avenue Appia 20, 1211 -Geneva 27-Switzerland,(Telephone: + 41 22 791 21 11(fax): + 41 22 791 31 11) పిలుపునిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సంస్థ అనారోగ్యానికి దారి తీసే ప్రధాన అంశం మీద పరిశోధించి అంతర్జాతీయ, దేశీయ, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలలో నిర్ణీత ప్రాంతాలలో ఏఫ్రిల్ 7వ తేదీన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం-2011లో ప్రపంచ ఆరోగ్య సంస్ధ నినాదము : “ఔషధ నిరోధకతపై పోరాడుదాం”

ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజారోగ్య సంరక్షణకు సంబంధించిన ఒక ప్రాధాన్యతాంశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలలోకి తీసుకెళ్లేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ(WHO) ఒక ప్రచార నినాదాన్ని ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ నినాదం “ ఔషధ నిరోధకత పై పోరాడుదాం .” (combat drug resistance) డ్రగ్ నిరోధకతపై పోరాటం ''నో యాక్షన్ టు డే.... నో క్యూర్ టుమారో - నేటి అచేతనం ....రేపటి అస్వస్థత''.

ఔషధ నిరోధకత అంటే ఏమిటి ?
బాక్టీరియా, వైరస్, ఫంగస్, పరాన్నజీవులు వంటి రోగకారక జీవులు తమపై ఉపయోగించబడే యాంటిమైక్రోబియల్ మందులు నిష్పలితమైపోయే విధంగా పరిణామం చెందిన పరిస్ధితిని “ఔషధ నిరోధకత” అంటాము. అంటే ఆయా రోగకారక జీవులు మామూలుగా వాడే మందులకు నశించకుండా, తట్టుకుని జీవించగల్గుతాయి. ఔషధాలను తట్టుకునే నిరోధక శక్తి రోగకారక జీవులకు లభించిందన్నమాట ! దీన్నే మనం “ఔషధ నిరోధకత ” (drug resistance) అని పిలుస్తాం. పలురకాల మందులకు ఔషధ నిరోధకత కల్గిన సూక్ష్మజీవులను సూపర్ బగ్స్ అంటాము. వీటివల్ల ప్రపంచ మానవాళికి వ్యాధి తీవ్రత, ఆర్ధికభారం ఎక్కువవుతాయి. ఈ స్ధితి ఎందువల్ల వస్తుందంటే, విచ్చలవిడిగా , అసంబద్ధంగా యాంటిబయాటిక్స్ ని వాడటం వల్ల. ఉదాహరణకు ఏదైనా ఒక మందు తక్కువ క్వాలిటి రకం,తక్కువ మోతాదులో వాడటం వల్ల లేదా పూర్తి కోర్సు వ్యవధికాలం వాడకపోవడం వల్ల ఈ పరిస్ధితి రావచ్చు.


ఔషధ నిరోధకత - కొన్ని వాస్తవాలు :
  • - ఔషధనిరోధకత కల్గిన జీవుల వలన కలిగే వ్యాధులు మామూలుగా వాడే మందులకు తగ్గకపోవడం వల్ల దీర్ఘకాలంపాటు వ్యాధి దుష్ఫలితాలకు లోనవడం, మరణాల రేటు కూడా ఎక్కువవడం జరుగుతుంది.
  • - ప్రతి సంవత్సరం 4,40,000 బహుళ ఔషధ నిరోధకత కల్గిన క్షయ వ్యాధి కేసులు నమోదవుతూ, 1,50,000 మరణాలకు కారణమవుతున్నాయి. 64దేశాల్లో మొత్తం క్షయ కేసులు ఔషధ నిరోధకత కల్గినవిగా నిర్ధారించబడటం ఆందోళనకరమైన అంశం.
  • - మలేరియా విస్త్రతంగా వ్యాపించివున్న అనేక దేశాలలో మలేరియాకు వాడబడే క్లోరోక్విన్, సల్ఫడాక్సిన్-పైరిమెధమిన్ వంటి పాతతరం మందులకు నిరోధకత సాధారణమైపోయింది.
  • - హాస్పిటల్ ద్వారా సంక్రమించే వ్యాధులలో ఎక్కువ శాతం తీవ్రమైన ఔషధ నిరోధకత కల్గివుండే ఎం.ఆర్.ఎస్.ఏ (మెధిసిలిన్ రెసిస్టెంట్ స్టాఫిలోకోకల్ ఆరియస్) వంటి బాక్టీరియా వల్ల సంక్రమిస్తున్నాయి.
  • - అసంబద్ధ, హేతురహితమైన యాంటిబయాటిక్ మందుల వాడకం ఔషధ నిరోధకత కల్గిన రోగక్రిములు ప్రబలడానికి, బలపడటానికీ దోహదం చేస్తున్నది.
  • - ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించిన ప్రకారం పిల్లల్లో రక్తవిరేచనాలకు కారణమైన షిజెల్లా వ్యాధికి సిప్రోఫ్లోక్సాసిన్ పనిచేస్తుంది. కానీ అదే సిప్రోఫ్లోక్సాసిన్ ను హేతువిరుద్ధంగా వాడిన ఫలితంగా షిజెల్లా జీవులకు సిప్రోఫ్లోక్సాసిన్ కు ఔషధ నిరోధకత రావడంతో పరిస్ధితి జటిలమయ్యింది.
  • - అతి సాధారణమైన గనేరియా లాంటి సుఖవ్యాధి కూడా మాత్రల రూపంలో తీసుకునే “ సెఫలోస్పోరిన్స్ ” అనే మందుని విచ్చలవిడిగా వాడకం వల్ల , క్లిష్టమైన మందులు వాడితే కానీ లొంగని పరిస్ధితి ప్రబలుతున్నది.

“ఔషధ నిరోధకత ” కు దారితీస్తున్న కారణాలు :

  • యాంటిబయాటిక్స్ తక్కువ క్వాలిటి వాడకం, పూర్తి కోర్సు వ్యవధి వాడకపోవడం వంటి కారణాలు సాంకేతికంగా ఔషధ నిరోధకతకు దారితీస్తాయి.
దీనితోపాటు ఈ క్రింది అంశాలు కూడా ఔషధ నిరోధకతకు దోహదం చేస్తున్నాయి.
  • - జాతీయస్ధాయిలో చిత్తశుద్ధి లోపించిన ఫలితంగా సమగ్రమైన, సమన్వయంతో కూడిన కార్యాచరణ లేకపోవడం, జవాబుదారీతనం లోపించడం, క్రిందిస్ధాయి ప్రజలను భాగస్వాముల్ని చేసే ప్రణాళికలు లేకపోవడం
  • - బలహీనమైన లేదా పనిచేయని స్ధితిలో పర్యవేక్షణ వ్యవస్ధలుండటం.
  • - క్వాలిటి మరియు నిరంతరాయంగా మందులు అందుబాటులో ఉండేలా చూసే వ్యవస్ధలు అసంపూర్తిగా ఉండటం,
  • - ఇన్ఫెక్షన్ నివారణ మరియు నియంత్రణల అమలు వైఫల్యం,
  • - డయాగ్నొస్టిక్స్, మందులు, వాక్సిన్స్ ఉత్పత్తిలో మందగొండితనం, కొత్త ఉత్పత్తుల తయారీకై పరిశోధన మరియు అభివృద్ధి తగినంతగా లేకపోవడం,




ఔషధ నిరోధకతను ఎలా అడ్డుకోవాలి !

నేడు మనిషి ఆరోగ్యంగా, ఎక్కువకాలం జీవించగల్గడానికి ఒకానొక కారణం వ్యాధులను నియంత్రించగల్గే శక్తివంతమైన ఔషధాల లభ్యత . 1940లో యాంటిమైక్రోబియల్ మందులు కనిపెట్టబడి, లభ్యమయ్యేదాకా ప్రజలు ఇన్ఫెక్షన్లతో పెద్దఎత్తున మరణిస్తుండేవారు. నేడు యాంటిమైక్రోబియల్స్ లేకుండా ప్రపంచాన్ని ఊహించలేము. నేడు మనకు అటువంటి యాంటిమైక్రోబియల్స్ అందించిన శక్తివంతమైన రక్షణను కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తున్నది. గత 70సంవత్సరాలుగా మానవ, జంతు ప్రపంచంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఔషధాల వినిమియం ఫలితంగా యాంటిమైక్రోబియల్స్ కు ఔషధ నిరోధకత కల్గివున్న జీవుల సంఖ్య క్రమంగా పెరుగుతూవస్తున్నది.

ఫలితంగా మరణాల సంఖ్య, అనారోగ్య తీవ్రత , ఆరోగ్యసంరక్షణా వ్యయం అధికమౌతున్నాయి. ఈ పరిస్ధితి ఇలాగే కొనసాగితే, అనేక ఇన్ఫెక్షన్స్ - వ్యాధులు నియంత్రించలేనివిగా మారి ఇప్పటిదాకా ఆరోగ్యరంగంలో సాధించిన విజయాలు తారుమారయ్యే దుస్ధితి మానవాళికి దాపురిస్తుంది. పైగా శరవేగంతో విస్తరిస్తున్న దేశాంతర వ్యాపారాలు, ప్రయాణాల వల్ల ఈ ఔషధ నిరోధకత కల్గిన జీవులు గంటలవ్యవధిలోనే విస్తరించడానికి సులువవుతుంది. ఔషధ నిరోధకత పూర్తిగా కొత్త సమస్య కానప్పటికీ, కొన్ని దేశాలు దీని నివారణకు చర్యలు చేపడుతున్నప్పటికీ, ఔషధ నిరోధకత ఫలితంగా “ యాంటిబయాటిక్స్ కనుగొనక ముందు రోజుల(old days) దుస్ధితి ” లోకి మానవాళి నెట్టబడకుండా ఉండాలంటే అన్ని ప్రపంచదేశాల మధ్య సమన్వయంతో కూడిన సమిష్టి కృషి తక్షణం ప్రారంభం కావల్సివుంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం-2011 సందర్భంగా ఔషధ నిరోధకతకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలన్నిటినీ కార్యాచరణకు సమాయత్తం చేసేందుకు ఒక 6-పాయింట్ల ప్యాకేజిని ప్రకటించింది.

ఈ ఆరు అంశాలలో బలహీనతలను అధిగమించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిస్తోంది.

  • 1. పరిశోధన లేమి
  • 2. చిత్తశుద్ధి కొరత
  • 3. పర్యవేక్షణ లోపం
  • 4. ఔషధ నాణ్యత లోపం
  • 5. ఔషధ వినియోగంలో హేతుబద్దత లోపించడం
  • 6. ఇన్ఫెక్షన్ నియంత్రణ లోపాలు

ఈ అంశాలపై కేంద్రీకరించి ఔషధ నిరోధకతను పై పోరాడేందుకు సన్నద్ధం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఈ క్రింది రంగాలలో ఉండేవారికి పిలుపునిస్తున్నది.

  • - పాలసీ నిర్ణేతలు, ప్రణాళికా నిర్దేశకులు
  • - ప్రజలు, పేషెంట్స్
  • - ప్రాక్టీషనర్స్(డాక్టర్స్ .,ఇతరత్రా)
  • - ఫార్మసిస్టులు, ఔషధ విక్రేతలు
  • - మందుల పరిశ్రమ
ప్రపంచ ప్రజల ఆరోగ్యసంరక్షణకు పెను సవాల్ గా మారనున్న ఈ ఔషధ నిరోధకతను అడ్డుకోవడం తక్షణ ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఔషధ నిరోధకత గురించి ప్రజలలో విస్త్రతంగా ప్రచారం గావించి , మానవాళికి రానున్న పెనుముప్పుపై పోరాటం జరపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

ప్రతి రోజు నిద్ర లేచినదగ్గర నుంచి ఉరుకులు పరుగులమయంతో కూడుకున్న ఈ జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక నేటి ప్రజలకు కొరవడింది. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యం కోసం ఇరవై సూత్రాలను తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

  1. ఉదయం నిద్ర లేవగానే పరకడుపున రెండు-మూడు గ్లాసుల నీటిని సేవించండి.
  2. ప్రతి రోజు కనీసం పదిహేను నిమిషాలపాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయండి.
  3. ఉసిరి లేదా త్రిఫలాతో కూడుకున్న నీటిని సేవించండి.
  4. వారానికి ఓ రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. ఉపవాసం ఉన్న రోజులో కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవించండి.
  5. టీ, కాఫీ, పొగాకు, ధూమపానం, మద్యపానం, గుట్కా తదితరాలను సేవించకండి.
  6. ఉదయాత్పూర్వమే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి.
  7. మీరు తీసుకునే భోజనంలో పులుపు, మిర్చి-మసాలాలు, చక్కెర, వేపుడు పదార్థాలను దూరంగా ఉంచండి.
  8. భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి.
  9. భోజనంలో సలాడ్, రుతువులననుసరించి పండ్లు తప్పనిసరిగా తీసుకోండి.
  10. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులుండేలా చూసుకోండి.
  11. మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి.
  12. ప్రతి రోజు క్రమం తప్పకుండా స్నానం చేయండి. దీంతో శరీరం శుభ్రమవ్వడమే కాకుండా ఆరోగ్యంగానూ ఉంటారు.
  13. ఉదయం మీరు తీసుకునే అల్పాహారం తేలికపాటిదై ఉండాలి. త్వరగా జీర్ణమయ్యేదిగా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
  14. నిద్రకు కృత్రిమమైన సాధనాలను ఉపయోగించకండి.
  15. మిగిలిపోయిన లేదా పాచిపోయిన ఆహారాన్ని తీసుకోకండి, దీంతో ఆకలి తీరడం మాట అలావుంచితే అనారోగ్యంపాలవ్వడం ఖాయం.
  16. పండ్లు తీసుకునేటప్పుడు అవి తాజాగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించి మరీ తీసుకుంటే మంచిది. ఎక్కువరోజులు నిల్వవుంచిన పండ్లను తీసుకోకూడదు.
  17. ఉదయం-రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా దంతావధానం చేయాలి.
  18. సమయానుసారం భోజనం చేయాలి, రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి.
  19. అలాగే రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి. దీంతో ఆరోగ్యం పాడవ్వడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేసే అవకాశాలు ఎక్కువ. పైగా మరుసటిన రోజు చేయాల్సిన పనులు ఆలస్యంగానే ప్రారంభమౌతాయి.
  20. మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లౌతుంది. దీంతో ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకిష్టమైన సంగీతం లేదా పుస్తకపఠనం చేస్తే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పట్టణీకరణ – ఆరోగ్యము

పెరిగిపోతున్న నగరాలు తరిగిపోతున్న ఆరోగ్యం - ఏప్రిల్ 7 న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్యదినం జరుపుకొంటాము. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ఒక ఆరోగ్య సమస్యపై సందేశమిస్తుంది. ఆ ఆరోగ్య సమస్యను గురించి అందరూ ఆలోచించి, నివారణకు మరియు నిర్మూలనకు కృషిచేయాలి. ఈ సంవత్సరపు సందేశము ‘పట్టణీకరణ – ఆరోగ్యము’ పట్టణాలలోని అనేక సమస్యల గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పట్టణాలలో 300 కోట్ల ప్రజలు జీవిస్తున్నారు. ప్రపంచ చరిత్రలో క్రీ.శ.2007లో మొట్టమొదటిసారి పట్టణాలలో జీవించే ప్రజల సంఖ్య 50 శాతం దాటింది. కొన్ని అంచనాల ప్రకారం క్రీ.శ.2030 నాటికి ప్రతి పదిమందిలో ఆరుగురు, క్రీ.శ.2050 నాటికి ప్రతి పదిమందిలో ఏడుగురు పట్టణాలలో జీవిస్తారు. ఇప్పుడు
మనం జీవించే ప్రపంచంలో పట్టణీకరణ అనేది ఏ మాత్రం సరిదిద్దలేని వాస్తవం. పట్టణీకరణ వల్ల వ్యక్తులపైనా, కుటుంబాలపైనా, సమాజంపైనా అనేకరకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.

పట్టణాలు – నగరాలు – ఆరోగ్య సమస్యలు
పట్టణాలు – నగరాలలో ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం పెరుగుతున్న జనాభా. ఇందువల్ల కనీస అవసరాలు అయిన నీరు, ఆహారం, గృహ వసతి చాలినంత లభించవు. సౌకర్యాలు ఉండవు.

పట్టణీకరణ – పరిసరాల పారిశుధ్యం
పట్టణాలు- నగరాలు పెద్దవి అయ్యేకొద్దీ మురికివాడలు ఎక్కువ అవుతాయి. గృహ వసతి తగ్గిపోతుంది. పరిశ్రమలు పెరిగిపోతాయి. ఈ పరిస్థితులో తాగునీటి సమస్య ఏర్పడుతుంది. నీరు కలుషితం అవుతుంది. పరిశ్రమల నుండి విడుదల అయ్యే రసాయన పదార్థాలు నీటివనరులు పాడుచేస్తాయి. మురుగునీటిని పట్టించుకోకపోవడంవల్ల మురుగునీరు, మంచినీరు కలిసిపోతాయి. ఇందువల్ల నీళ్ళ విరేచనాలు, చీము రక్తవిరేచనాలు, అమీబియాసిస్, కలరా, టైఫాయిడ్, కొన్ని రకాల పచ్చకామెర్లు, నులిపురుగుల వ్యాధులు మరియు పోలియో వ్యాధులు ప్రజలకు వచ్చే ప్రమాదముంది. రసాయనాలతో కలుషితం కావడవంవల్ల ఆ నీటితో రసాయనాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి.

పట్టణీకరణ – వాయుకాలుష్యం
పట్టణీకరణవల్ల వాయుకాలుష్యం ఎక్కువ అవుతుంది. ఇందువల్ల ప్రజలు శ్వాసకోశవ్యాధులకు గురి అవుతారు.

పట్టణీకరణ – అందుబాటులో లేని ఆరోగ్యసేవలు
పెరుగుతున్న జనాభావల్ల, పేదరికంవల్ల పట్టణాలలో ప్రజలందరికీ సంతృప్తికరమైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండవు. పట్టణాలలో ప్రభుత్వ ఆసుపత్రులు దూరంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలలోలాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు ఉండవు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేయడం కష్టంగా ఉంటుంది. పట్టణాలలో ప్రైవేటు వైద్యసేవలు ఎక్కువగా ఉంటాయి. ఈ సేవలు పేద ప్రజలకు ఎంతో ఆర్థిక భారం కలిగిస్తాయి.

పట్టణీకరణ – అపరిశుభ్రమైన ఆహారం
పెరుగుతున్న జనాభావల్ల పారిశుద్ధ్యం లోపించి అపరిశుభ్రమైన ఆహారం తినవలసి వస్తుంది. ఇందువల్ల టైఫాయిడ్, పచ్చకామెర్లు, విరేచనాల వ్యాధులకు గురిఅయ్యే అవకాశాలు ఎక్కువ.

పట్టణీకరణ – మానసిక వ్యాధులు
గ్రామాల్లో ఉండే ప్రేమ – అనురాగం పట్టణాల్లో ఒకరికొరికి ఉండవు. పట్టణాలలో ఇష్టంలేని పరిస్థితులలో సర్దుబాటు చేసుకోవలసి వస్తుంది. ఈ సర్దుబాటుకు వీలుకాని చోట్ల మానసిక సమస్యలు ఎక్కువవుతాయి.

పట్టణీకరణ – ప్రమాదాలు
పెరుగుతున్న రద్దీ, వాహనాల వాడకం, పారిశ్రామీకీకరణవల్ల పట్టణాలలో ప్రమాదాలు ఎక్కువగా జరిగి అంగవైకల్యం – మరణాలు ఎక్కువ అవుతాయి.

పట్టణీకరణ – సామాజిక అనారోగ్యం
పట్టణాలలో మద్యం వాడకం, మత్తుమందుల వాడకం, పేకాట, వ్యభిచారం, విడాకులు, కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమవుట, బాలనేరాలు, నేర ప్రవృత్తి పెరుగుట సాధారణంగా ఉత్పన్నమవుతాయి. నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలవల్ల కూడా సామాజిక సమస్యలు పట్టణాలలో ఎక్కువ. అడుక్కొని జీవించేవారు, బాల కార్మికులు కూడా పట్టణాలలో ఎక్కువ.

ఆరోగ్యకరమైన నగరమంటే---ఆరోగ్యకరమయిన నగరానికి ఈ లక్షణాలుండాలి
* పరిశుభ్రమయిన మరియు రక్షిత వాతావరణం,
* ప్రజలందరికీ కనీస అవసరాలు లభించాలి.
* ఒకరినొకరు దోపిడీ చేసుకోకుండా, బాగా కలిసిపోయి ఒకరికొకరు సహాయం చేసుకొనే మనస్తత్వం ప్రజలలో ఉండాలి.
* స్థానిక సంస్థల పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం ఉండాలి.
* ప్రజలందరూ అన్ని రకాల సమాచారం పొందాలి.
* తరచుగా చారిత్రాత్మక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి.వాటిలో అందరికీ అందుబాటు, భాగస్వామ్యం కల్పించాలి.
* నాశనంకాని పరిసరాల సమతుల్యం సాధించాలి.

మెరుగైన పట్టణాలు : మనందరి బాధ్యత
పట్టణాలలో జీవన పరిస్థితులు పెంపొందించుటకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘ఆరోగ్యకరమైన నగరాల ప్రణాళిక’ ప్రకటించింది. సమాజంలోని వ్యక్తులందరూ వ్యాధులు ఎందుకు వస్తాయో తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తి సమస్యలు తీర్చుటకు ప్రతి అవకాశం ఉపయోగించుకోవాలి. మనకున్న వనరులను పరిమితంగా వాడుకోవాలి. అందరికీ అందుబాటులో ఉండేటట్లు చూడాలి. వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గించుకోవాలి. పట్టణాలు ఆరోగ్యానికి నిలయం కావాలంటే పౌర సమాజం బాధ్యత ఎంతో ఉంది. తరచుగా ఆరోగ్య సమావేశాలు నిర్వహించాలి. ఆరోగ్య సమస్యలను గురించి తెలుసుకొని అధికార్లతో, ప్రభుత్వ సంస్థలతో చర్చించాలి. ప్రజలను చైతన్యం చేసే ఆరోగ్య సమావేశాలు, చర్చలు, అవగాహనా సదస్సులు ఏర్పాటుచేయాలి. కూడలి ప్రాంతాలలో ‘హెల్త్ బోర్డులు’ ఏర్పాటుచేసి వారం వారం శాస్ర్తియ సమాచారం అందించాలి. సమిష్టిగా కృషిచేసి చెట్లు పెంపకం, పార్కులు, ప్రజారవాణా వ్యవస్థ మెరుగుపరచేలా చూడాలి. పట్టణాలలో పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు వివిధ ఆరోగ్య సమస్యల గురించి స్థానిక వైద్య సిబ్బంది సహకారంతో బోధించాలి. పట్టణాలలో నిర్మాణాలకు సాంకేతిక పరిజ్ఞానం కల్పించే వారు పచ్చిక బయళ్ళు పెరిగేదానికి అనువైన పరిజ్ఞానం అందించాలి. శాస్తవ్రేత్తలు కాలుష్యం తగ్గించే పరిశోధనలు చేసి పాలకులకు, ప్రజలకు శాస్ర్తియ సమాచారం అందించాలి. పారిశ్రామికవేత్తలు అధిక లాభాలు వదులుకొని చట్టాల పరిధిలో పరిశ్రమలు నడపాలి.

పట్టణీకరణ – గ్రామీణుల పాత్ర
పట్టణాలలో ఉండే ప్రత్యేక ఆరోగ్య సమస్యలు దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రజలు పట్టణాలపై వ్యామోహం పెంచుకొని పట్టణాలపై ఉరుకులు పరుగులు తీయరాదు. బంగారు గ్రామసీమలు మనుష్యులు లేని అరణ్యాలు కాకుండా చూడాలి. గ్రామాలనే స్వర్గ్ధామాలుగా నిర్మించుకోవాలి.

వేయి నగరాలు – వేయి జీవితాలు
ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వేయినగరాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని తలపెట్టింది. ఈ కార్యక్రమం పేరే ‘వేయి నగరాలు- వేయి జీవితాలు’. ఒక్క రోజు నగరాల్లోని కొన్ని వీధులలో వాహనాల రాకపోకలను వీధులను మూసివేసి, ఆ వీధుల్లో ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించాలి. నగర మేయర్ల సారథ్యంలో పట్టణాలలోని పట్టణ సమావేశ మందిరాల్లో ప్రపంచ ఆరోగ్యదినం జరుపుకోవాలి. పట్టణాలలోని ఇరుగుపొరుగువారికి, అనాథ ఆశ్రమాలను, అట్టడుగు
వర్గాల ప్రజలను, పాలకులు, పౌర సమాజంలోని కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు వారి అవసరాలు తీర్చే ప్రయత్నాలు చేయాలి. పట్టణాల ప్రజల జీవితాలు మెరుగుపరచుటకు కృషిచేసినవారిని ‘పట్టణ హీరోలు’గా బహిరంగంగా గుర్తించాలి. పట్టణీకరణవల్ల ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలను కేవలం వైద్య ఆరోగ్య శాఖే తీర్చలేదు. పరిపాలనలోని వివిధ శాఖలు వారి వారి కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా రూపొందించి అమలు చేయాలి. పట్టణాలు జీవించేదానికి అర్హతగల స్థాయిలో ఉండేలా చేయాలి. ప్రపంచ ఆరోగ్య దినం అందరూ జరపండి. ఈ అంశాలు ఈ రోజుకు మాత్రమే పరిమితం చేసుకోకుండా, జీవితమంతా ఆచరించే అంశాలుగా అలవాటుచేసుకొని జీవించండి. ఈ సందర్భంగా ప్రస్తావించిన అంశాలు స్నేహితులతో, బంధువులతో, సహచరులతో మాట్లాడండి! మీరూ ఆరోగ్యాన్ని గురించి మాట్లాడండి!

- డాక్టర్ ఆరవీటి రామయోగయ్య-Posted by liveseva on April 4th, 2011

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...